Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ కు ‘కారే’ ప్రత్యామ్నాయం

పంచాయతీ. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పుతో స్పష్టత ఇచ్చారు
ఇదే ఉత్సాహంతో జడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలబడతాం
విరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు
కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం
గద్వాలలో ఒక్క ఓటుతో గెలిచాం
మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో అధికార కాంగ్రెస్‍కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇది తేలిపోయిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అని గొప్పలు చెప్పుకున్న బీజేపీ పుర ఫలితాల్లో ఘోరపరాజయం పాలైందన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‍లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఎన్నికల్లో ఆశించిన మేరకు మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని పల్లె, పట్టణ ప్రజలు తేల్చారన్నారు. ఈ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతోనే రాబోయే జడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలబడతామన్నారు. ఈ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ స్పష్టమైన గెలుపొందామని, మరో 30 స్థానాల్లో హంగ్ ఉందని వీటిల్లో ఎలా వ్యహరించాలనేది స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గద్వాలలో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేసి చివరికి ఒక్క ఓటుతో గెలిచామన్నారు. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

సీపీఐకి ఓపెన్ ఆఫర్:
కొత్తగూడెం కార్పొరేషన్‍లో హంగ్ పరిస్థితి ఏర్పడటంతో ఇక్కడ మేయర్ సీటు కోసం సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని కేటీఆర్ చెప్పారు. సింగరేణి లో జరిగిన బొగ్గుకుంభకోణాన్ని తాము భయటపెట్టాక పెద్దపల్లి జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్‍కు సీపీఐ బహిరంగంగా మద్దతు ఇచ్చిందన్నారు. దాంతో కొత్తగూడెంలో సీపీఐకి తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో సైతం మాట్లాడానన్నారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం ఈ నిర్ణయాంతో ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాల్లో గెలిచాయి. మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ1, సీపీఎం 1, స్వతంత్రులు ఆరు చోట్ల గెలుపొందారు. ఇక్కడ కూనంనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్ అఫీషియోతో ఉపయోగించుకున్నా హంగ్ పరిస్థితే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫర్ తో సీపీఐ కోర్టులో బంతి ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆఫర్ ను సీపీఐ అంగీకరిస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇదో సరికొత్త సమీకరణంగా మారుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు లేదా ఫ్రెండ్లీ పోటీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో జత కడితే ఇది ఆసక్తికర పరిణామంగా మారనుంది.

Leave A Reply

Your email address will not be published.