Take a fresh look at your lifestyle.

లోకల్ పోరులో చేతులెత్తేసిన గులాబీ: బీఆర్ఎస్‌లో అంతర్మథనం

–  స్థానిక నేతలకు వదిలేసిన అధిష్టానం
–  పట్టు సాధించలేకపోయిన బీఆర్ఎస్
–  ఇద్దరు కీలక నేతలకే పరిమితం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను స్థానిక లీడర్లకు అప్పగించడమే పెద్ద తప్పుగా మారింది. కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు మినహా.. మిగిలిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేతులేత్తేశారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లల్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. మిగలిన చోట హంగ్ లేదంటే రెండో స్థానంలో నిలిచారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కంచుకోటగా భావించే సూర్యాపేట మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది. కేవలం సూర్యాపేటలోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీ దక్కలేదు. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌, జమ్మికుంటలో భంగపాటు తప్పలేదు. వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఆయన నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. జనగామలో హంగ్ వచ్చింది. అలంపూర్ లో ఒక్క స్థానం కూడా గెలువలేదు. అటు కోరుట్లలో కాంగ్రెస్, మెట్ పల్లిలో హంగ్ వచ్చింది. హైదరాబాద్ శివారులోనే ఆ పార్టీ పరువు దక్కించుకుంది.

బీఆర్ఎస్ కు ఇబ్బంది
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీష్ రావు తమ సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోగలిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్రనేతలు , మాజీ మంత్రులు పార్టీని గెలిపించలేకపోయారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కంచుకోటగా భావించే సూర్యాపేట మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది. గత ఎన్నికల్లో గెలిచిన గులాబీ పార్టీ, ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం సూర్యాపేటలోనే కాకుండా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీ , కార్పొరేషన్‌లోనూ బీఆర్ఎస్ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది.

హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి షాక్
అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో భంగపాటు తప్పలేదు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించింది. ఇక్కడ కౌశిక్ రెడ్డి పంతానికి పోయి చేసిన ప్రచారం పనిచేయలేదు. అటు జమ్మికుంట మున్సిపాలిటీ లో కూడా బీఆర్ఎస్ వెనుకబడిపోయింది. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎర్రబెల్లి ఇలాకాలోనూ అదే పరిస్థితి
వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఆయన నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అధికార కాంగ్రెస్ గాలిని తట్టుకోవడంలో ఎర్రబెల్లి వ్యూహాలు ఫలించలేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఫల్యం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజారిటీ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోయారు. కేవలం కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే పార్టీ తన ఉనికిని చాటుకుంది. మున్సిపల్ ఫలితాల అనంతరం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో తిరగడం మానేసి, కేవలం విమర్శలకే పరిమితమైన నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పార్టీలోని అంతర్గత విభేదాలు, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషణలు వస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.