బోథ్, ముద్ర:
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2026- 27 కు గాను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి గ్రామానికి చెందిన సింగడి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఈయన తన సమీప ప్రత్యర్థి చిక్కుడు ప్రభాకర్ పై 275 ఓట్లతో విజయం సాధించారు. సురేందర్ రెడ్డి 1999 లో రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. న్యాయ శాస్రం లో మంచి పట్టున్న ఈయన అనతి కాలంలోనే రాష్ట్రంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మెజార్టీ కేసుల పరిష్కారం కోసం ఈయననే సంప్రదిస్తారు. ఇప్పటికే హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ లో పలు పదవులను నిర్వర్తించిన ఈయన తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో మద్దతు నిలిచిన న్యాయవాదులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం తో పాటు వారు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారంకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల బోథ్ మండలం చెందిన వ్యక్తి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల జిల్లా వాసులు, కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.