- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.
- వ్యవసాయశాఖ మంత్రి కి ఎమ్మెల్యే లేఖ.
- మరో వారంలో అర్హులందరి ఖాతాల్లో డబ్బు జమ.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం, అబ్ధుల్లాపూర్ మెట్ మండలాల పరిధిలోని రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ కావడం లేదని రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. మరో వారంరోజుల వ్యవధిలో అందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. మంత్రి తుమ్మల, వ్యవసాయ శాఖ కమిషనర్ లకు ఇబ్రహీంపట్నం, అబ్ధుల్లాపూర్ మెట్ మండలాల పరిధిలోని రైతులకు రైతు భరోసా నిధుల విడుదలపై లేఖ రాసినట్లు చెప్పారు. మరో వారం గడువులో అందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసాపై రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తూ, ప్రతిపక్షాలు రైతులపై ఎన్నడూ లేని ప్రేమలు ఒలకబోస్తున్నాయని ఆరోపించారు. రైతు ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరుగుతుందని పునరుద్ఘాటించారు.