ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపడుతున్న పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి స్పష్టమైన మార్పు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపురం చౌరస్తాలో జరుగుతున్న జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డుపై “గో స్లో” వైట్ పెయింటింగ్, పాఠశాలల వద్ద ప్రత్యేక హెచ్చరిక బోర్డులు, సరైన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వంటి చర్యలు ప్రజల్లో అప్రమత్తత పెంచుతాయని తెలిపారు. ప్రమాదాల ప్రధాన కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పనులు పూర్తి చేయడమే కాకుండా నాణ్యతను కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు.
అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, యువతలో స్పీడ్‌పై నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీవో చిన్న బాలు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.