ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు.
అలాగే ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇదే సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.
మంగళవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్య ద్వారా ఎదగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు నేటికీ ప్రాముఖ్యత కలిగినవని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన నమ్మకాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకునేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.