Take a fresh look at your lifestyle.

గ్రామ సభలను పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించాలి — రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

 

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, మరియు వార్డు సభలను పకడ్బందీగా,పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
మంగళవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు మరియు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలు/వార్డు సభల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు గ్రామసభలు/వార్డు సభలు నిర్వహించాలని, గ్రామ సభలు నిర్వహించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.స్థానిక ప్రజాప్రతినిధులను ఈ సమావేశాలకు ఆహ్వానించాలని తెలిపారు.ఈసభలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.


ప్రత్యేకంగా రైతు భరోసా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను సభలో చదివి వినిపించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అలాగే జూన్ 2 నుండి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం అమలు చేయబోతున్న విషయాన్ని వివరించాలని,ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విశయం కూడా ప్రజలకు వివరించాలని సూచించారు.సాంస్కృతిక కళాకారుల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో గ్రామసభలు/వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఈకార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈసమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు,జెడ్పీ సీఈవో జానకి రెడ్డి,తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.