శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని, శ్రీరామనవమి పర్వదినాన శుక్రవారం సాయంత్రం రాజగోపురం వద్ద ఉన్న కళావేదికపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ప్రముఖ భాషా ప్రవీణ మరియు సంస్కృత భాషా ప్రచారకులు శ్రీ మైలవరపు లక్ష్మీనరసింహం గారు ఈ ప్రవచనాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు “త్రిశక్తి వైభవం” మరియు “శ్రీరామనవమి విశిష్టత” గురించి భక్తులకు వివరించారు. దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో రామకథను వినడం భక్తులకు కనువిందుగా నిలిచింది. అమ్మవారి శక్తికి, రాముని ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వారు తమ ప్రసంగంలో చక్కగా విశ్లేషించారు.
కార్యక్రమం అనంతరం ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఈవో శ్రీ శీనా నాయక్ గారు ప్రవచనకర్త శ్రీ మైలవరపు లక్ష్మీనరసింహం గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ శంకర శాండిల్య మరియు ఇతర దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం వేళ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రవచన కార్యక్రమాన్ని వీక్షించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.