Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ,10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి –జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహాదేవపూర్:

మార్చ్ 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న 10 తరగతి పరీక్షలలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, ప్రశ్నాపత్రాల రవాణా మరియు భద్రత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రశ్న, జవాబు పత్రాలు తరలించాలని సూచించారు. జిల్లాలో 21 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షణకు ఫ్లైయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసి వేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర సేవలకు వైద్య కేంద్రాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, అలాగే 108 వాహనాలు, ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వార్డులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అనువుగా అదనపు బస్సులు నడపాలని తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని పంచాయతి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో 10 వ తరగతి పరీక్షలు నిర్వహణపై విద్యాశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, సమాచార, పంచాయతి రాజ్, రవాణా, విద్యుత్తు, ఆర్టీసీ, ట్రెజరి, పోస్టల్, మున్సిపల్ అధికారులతోసమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, డీఈఓ రాజేందర్, వైద్యాధికారి మధుసూదన్, ఆర్టిఓ సంధాని, ఆర్టీసీ డిఎం ఇందు, డిపిఓ శ్రీలత, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పూర్తికాని ఇందిరమ్మ ఇళ్లకు తక్షణమే ప్రారంభించాలి-జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 4165 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అందులో 58 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన 4107 ఇళ్లలో 898 ఇళ్లు ప్రారంభ దశలో, 582 బేస్ లెవెల్ దశలో, 1092 రూఫ్ లెవెల్ దశలో, 481 రూఫ్ కాంక్రీట్ దశలో ఉండగా, 1054 ఇళ్లకు మార్క్ అవుట్ చేయాల్సి ఉందని, ప్రారంభించని ఇంద్రమ్మ ఇళ్ళకు తక్షణమే మార్కౌట్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను సమన్వయం చేస్తూ పనులు నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, అర్హులైన ప్రతి నిరుపేదకు గృహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. యంత్రాంగం సమన్వయంతో పని చేసి, మంజూరైన ఇళ్లన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సోమవారం ఐడిఓసి కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, పీఆర్, మున్సిపల్, ఎంపిడివోలతో
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్ మరియు 2బీహెచ్‌కే గృహాల సముదాయాల పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, అన్ని మండలాల ఎంపిడివోలు, గృహా నిర్మాణ శాఖ డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.