తుంగతుర్తి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం
ముద్ర ….తుంగతుర్తి…..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదిన సందర్భంగా ఉదయాన్నే వేప పూత, మామిడి ఆకుల తోరణాల కోసం గ్రామాల శివారులలోకి జనం తండలుగా వెళ్లి వాటిని సేకరించి తమ తమ ఇళ్లల్లో మామిడి తోరణాలను చక్కగా అలంకరించారు. అనంతరం వేపపూత, బెల్లం, మామిడికాయ, చింతపండు, ఉప్పు ,కారం లతో కూడిన ఉగాది ప్రసాదాన్ని తయారుచేసి దేవుడికి నైవేద్యం సమర్పించి అనంతరం కుటుంబ సభ్యులందరూ స్వీకరించారు. గ్రామాల్లో ఏ ఇంట్లో చూసినా ఉగాది పండుగ సందడే కనిపించింది .కొత్త బట్టలు ధరించి ఇళ్లల్లో నేతి బూరెలు బొబ్బట్లు భక్షాలు తదితర తీపి పదార్థాలను చేసుకొని ఇంటిల్లిపాది ఆనంద డోలికల్లో తెలియాడారు. అనంతరం సాయంత్రం ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ ఫలితాలను ఆయా గ్రామాల వేద పండితుల ద్వారా విని ఆనందించారు .ఈ సంవత్సరం వర్షాలు, కరువు కాటకాలు, సుఖదుఃఖాలు, ఏ విధంగా ఉంటాయనేది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకున్నారు. ఎవరి పేర్లు పైన ఏ విధమైన గ్రహచారం ఉంది అనే విషయాన్ని ప్రజలు వేద బ్రాహ్మణులను అడిగి తెలుసుకున్నారు .ముఖ్యంగా రాబడి, ఖర్చు ఏవిధంగా ఉంటాయని దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొనడం తమ తమ రాబడి ఖర్చులను బ్రాహ్మణుల ద్వారా తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకుడు కాటూరి రామాచార్యులు, శివాలయ అర్చకుడు శంకరమంచి శేషు శర్మ ల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏనగందుల సంజీవ తో పాటు గ్రామ పెద్దలు పోలవరపు సంతోష్, తాడికొండ సీతయ్య ,కాసం మల్లయ్య ,పెండెం యాదగిరి, బండారు దయాకర్, కోల వెంకటరామ నరసయ్య, పెండెం రామ్మూర్తి ,తల్లాడ కేదారి ,పెద్ద బోయిన అజయ్ ,ఓరుగంటి సుభాష్, ఓరుగంటి శ్రీనివాస్, శవ్వ వెంకటేశ్వర్లు, బండారు వినయ్, వీరబోయిన రాములు లతోపాటు పలువురు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.