Take a fresh look at your lifestyle.

పోలీస్ అక్కల సేవలు అభినందనీయం డీజీపీ శివధర్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా ఎందరో మహిళలకు సేవలు అందడం అభినందనీయమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిలను, పోలీస్ అక్కలను ఆయన మంగళవారం అభినందించారు. అనంతరం పోలీస్ అక్కలతో ప్రత్యేకంగా మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అక్కలతో ఆత్మీయంగా మమేకమై, వారి సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యార్థినులు,మహిళల భద్రతలో పోలీస్ అక్కలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినుల్లో సాన్నిహిత్యం పెంచుతూ, మహిళలకు ధైర్యం కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో పోలీస్ అక్కలు మరింత సమర్థవంతంగా సేవలు అందించి జిల్లాకి రాష్ట్రానికి ముఖ్యంగా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ అక్కలు తమ సేవా అనుభవాలు, ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను డీజీపీతో పంచుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వలననే ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలిగామని పోలీస్ అక్కలు వివరించారు. అనంతరం పోలీస్ అక్కలకు రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా స్కోచ్ రిప్లికా అవార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. జి. జానకి షర్మిల, భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏ ఎస్పీ సాయి కిరణ్, జిల్లా పోలీసు అధికారులు, పోలీస్ అక్కలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.