- సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు
- ముందుగా లబ్ధిదారుల జాబితా చదవాలని పట్టుబట్టిన సబికులు
- ప్రజల నినాదాలు మధ్యనే ప్రసంగించిన ఎమ్మెల్యే
తుంగతుర్తి ముద్ర :- రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల అమలుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ తుంగతుర్తిలో రసాభాసగా మారింది. సాక్షాత్తు శాసనసభ్యుడు మందుల సామెల్ ప్రసంగాన్ని అడ్డుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే గోబ్యాక్ నినాదాలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే కాన్వాయ్ బయటికి వెళ్లడానికి మార్గం సుగమం చేశారు .ఒక దశలో కాన్వాయ్ ని చుట్టుముట్టిన గ్రామస్తులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అంతకుముందు గ్రామసభ ప్రారంభం కావడంతో గ్రామ కార్యదర్శి పథకాలను వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడబోగా పలువురు గ్రామస్తులు పథకాలలో లబ్ధిదారుల పేర్లు చదివిన తర్వాత మాత్రమే ఎమ్మెల్యే మాట్లాడాలని పట్టుబట్టారు .దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్ర ఘర్షణ గా మారింది. పలువురు రైతులు తమకు రైతు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు ఏవి పారదర్శకంగా అమలు కావడం లేదని మహిళలు గొంతు ఎత్తారు .తమకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు . దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అర్ధాంతరంగా సమావేశం ముగించుకుని ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అనంతరం అధికారులు ప్రజలకు సమాధానం చెప్పలేక పోలీసుల సహకారంతో గ్రామసభ ముగించారు. గ్రామసభలో తమ సమస్యలు అడగడానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదురు కావడం తో అటు అధికారులు శాసనసభ్యుడు జీర్ణించుకోలేకపోవడం గమనార్హం.