ముద్ర కూకట్‌పల్లి : వెస్ట్ సాయి నగర్ కాలనీలోని శ్రీ ఎర్ర పోచమ్మ తల్లి దేవస్థాన తృతీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
రాజేశ్వరరావు ఆలయానికి చేరుకోగానే కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచారణల మధ్య ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు బీజేపీ నాయకులు రామరాజు, నర్సింగ్ , స్థానిక కాలనీ వాసులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారి కృపాకటాక్షాలతో కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు.