- తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేసిందే బీఆర్ఎస్.
- హరీష్ రావుతో నేనే ఎందుకు కలుస్తాను.
- చావులు, పెండ్లిలు తప్పితే ఎక్కడా కలుసుకోలేదు.
- రాజకీయ చర్చలు అసలే లేవు.
- బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఒక కల.
- తెలంగాణకు దిక్చూచి బీజేపీ.
- కేసీఆర్ అప్పులపాలు చేస్తే.. రేవంత్ తీరని నష్టం చేస్తున్నాడు.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. నియంతృత్వంగా వ్యవహరించిన కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని ఆయన దుయ్యబడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా అదే పరిస్థితి కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు.. మూడు తరాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. జూన్ 2న వేడుకల జరుపుకుంటున్నామని, తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదని, పోరాటం రక్తతర్పణ ప్రాణత్యాగాలతో తెచ్చుకున్నామని అన్నారు. 1969 ఇందిరా గాంధీ, బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వాలు 369 మంది ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన పార్టీ కూడా బీజేపీ అని ఆయన తెలిపారు. 2007 లోనే తెలంగాణ గడ్డమీద రాజనాథ్ సింగ్ మద్దతు ప్రకటించారని, ఏఏసీ లో బండారు దత్తత్రేయ, అశోక్ యాదవ్ కీలక పాత్ర పోషించారన్నారు.సుష్మా స్వరాజ్ ఆత్మహత్యలు చేసుకోవద్దని మన యువకులకు పిలుపునిచ్చారని, పార్లమెంట్ లో నిప్పులు చెరిగారని, అందుకే ఆమెను చిన్నమ్మగా పిలుచుకుంటున్నామని ఆయన తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ముందు వెనుక అయ్యింది కానీ బీజేపీ వెనక్కు పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబానికి 25 వేలు ప్రతి నెల ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేస్తామని, 250 గజాల స్థలం ఇస్తామన్నారని, మ్యానిఫెస్టోలో పెట్టి ఒక్కటి కూడా చేయలేదని ఎంపీ ఈటల విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేస్తే, ప్రస్తుత సిఎం రేవంత్ రెండు నాలుకల ధోరనితో నష్టం చేస్తున్నారని అన్నారు. అబద్ధాలు, ఫక్తు రాజకీయాలు తప్పితే ప్రజల బాగోగులు చూసుకొనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఆయన దుయ్యబట్టారు. జిమ్మెద్దార్ బాధ్యత గల పార్టీ బీజేపీ అని, ప్రధాని మోడీ అండతోనే అభివృద్ధి సాధ్యం అని ప్రజలు అనుకుంటున్నారని ఎంపీ ఈటల తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ఆశలు అడియాశలు చేశాయని, బీజేపీ సంపూర్ణంగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల మీద కోట్లాడుతూ.. అంతిమంగా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి, దిక్సూచిలా ఉంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం పగటి కల అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఆయన ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ పాలన నిర్వాకం వలనే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం కమీషన్ వేసి 7 సార్లు వాయిదా వేసిందని, అసలు రాజకీయ లబ్ధికోసం చేస్తున్నారా ? అసలు దేని కోసం చేస్తున్నారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. సీబీఐకి అప్పగిస్తే విచారణ చేయిస్తామని మొదట్నుంచీ బీజేపీ చెబుతుందని అన్నారు. కాళేశ్వరమే కాకుండా ఇతర అంశాలపై వేసిన కమిషన్ల నివేదికలు ఎక్కడున్నాయని, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం చేశారని ఆయన నిలదీశారు. కేవలం బయట కొట్లాడుకుంటూ.. లోపల ఏం ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో తాను రహస్యంగా భేటీ అయ్యాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈటల రాజేందర్ చెప్పారు. చావులు, పెండ్లిళ్ళ దగ్గర మాత్రమే అనుకోకుండా హరీష్ రావును కలిశానని, ఏదో రాజకీయ చర్చలు చేసేందుకు కాదని ఎంపీ ఈటల స్పష్టం చేశారు.