Take a fresh look at your lifestyle.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయవాదుల సహకారం అవసరం – జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. :

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జి. భవాని చంద్ర పిలుపునిచ్చారు.
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా, మంగళవారం సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర మాట్లాడుతూ, రాజీ చేయదగిన పోలీస్ కేసులు, భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వివాదాలు, ఎక్సైజ్ కేసులు, బ్యాంక్ కేసులు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్నచిన్న వివాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం కంటే, ఇరువర్గాలు పరస్పర రాజీతో సమస్యలను పరిష్కరించుకొని సామరస్యంగా జీవించాలని సూచించారు.
అదేవిధంగా, న్యాయవాదులు తమ వంతు సహకారం అందించి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంతో పాటు, కక్షిదారులకు తగిన నష్టపరిహారం లభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంచార్జి కార్యదర్శి డి.వి.ఆర్. తేజో కార్తీక్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేశ్, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.