పెద్ద ఎత్తున తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులు…
అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వహకులు…
750 మంది పోలీసులతో భారీ భద్రత…
కూలిన చలవ పందిళ్లు… పలువురికి గాయాలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో బుధవారం నుంచి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే ఈ జయంత్ ఉత్సవాల సందర్భంగా ఆలయానికి హనుమాన్ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని, మాలవిరమణ చేసుకొని వెళ్తుంటారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం చలవ పందిళ్ళు, మరుగుదొడ్లు, తాగునీరు, కేశఖండన, మాల విరమణ, స్వామి వారి ప్రసాదాల వంటి వాటితో పాటు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

750 మంది పోలీసులతో భారీ భద్రత…
కొండగట్టులో గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు జరగనున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షపరులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తుంటారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కొండగట్టు హనుమాన్ ఆలయం, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి రఘుచందర్ ఆధ్వర్యంలో 750 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే భద్రత చర్యలో భాగంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, భక్తులు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కొండగట్టులో కూలిన చలువ పందిళ్లు…
కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చే హనుమాన్ దీక్షాపరుల కేశఖండన చేసుకునే భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అయితే గత రెండు రోజులుగా ఈదురుగాలులతో పాటు అకాల వర్షాల సందర్భంగా ఆలయం ముందు ఏర్పాటు చేసిన చలవ పందిరి కూలింది. ఈ ఘటనలో పెద్దగా ప్రమాదం జరగకపోయినా సుమారు 15 మంది భక్తులకు గాయాలు కాగా, పందిరి పక్కనే తెగిపడిన విద్యుత్ తీగల వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన ఈరోజు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.