- సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ.
- రాష్ట్ర అవతరణ దినోత్సవ స్పూర్తితో అన్నివర్గాల ప్రజలు ప్రగతిలో మమేకం కావాలి.
- ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పిలుపు.
- రంగారెడ్డి జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు.కొంగర కలాన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ప్రజలనుద్దేశించి వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు.వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
- తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి, వారి కుటుంబీకులకు సత్కారం.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాకు చెందిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ సంగీత, జిల్లా అధికారులు, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

- మహిళా సంఘాలకు రూ.80 కోట్ల రుణాల చెక్కు అందజేత.
జిల్లా జీవన జ్యోతి మహిళ సమాఖ్యకు 80 కోట్ల 02 లక్షల, 89 వేల చెక్కును, మెప్మా ద్వారా జిల్లాలోని 385 మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాల పంపిణీ చెక్కును వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ నారాయణరెడ్డి అందజేశారు.

- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పాఠశాలల నుండి వచ్చిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన చిన్నారులకు మెమోంటోలను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అందజేశారు.

- వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన శాలలు ఏర్పాటు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్ ను సందర్శించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో రాష్ట్ర పట్టణ,ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఛైర్మన్ చల్లా నర్సింహ రెడ్డి, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, రాచకొండ పోలీస్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
