. నూతన గురుకుల హాస్టల్ భవనాల శంకుస్థాపనలు
. హాజరైన ప్రముఖులు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జినుగుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ లో ఆదివారం రోజున సందీపని వార్షికోత్సవ వేడుకలు, గురుకుల హాస్టల్ భవనాల శంకుస్థాపనలు ఘనంగా జరిగాయి. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు తెలంగాణ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన జి నుగుర్తి గ్రామంలో ఇంత సువిశాల ప్రాంతంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నెలకొల్పడం ఈ ప్రాంత ప్రజలు ఎంతో ధన్యులని, ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయని ఆయన తెలిపారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ ఫౌండేషన్ సమాజానికి ఎంతోమంది మేధావులను అందించబోతుందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ విద్యను అందించాలని లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను తాండూర్ ప్రాంతంలోనే ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజలకు గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు, ఏకలవ్య ఫౌండేషన్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.