ముద్ర, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి :
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులే కాక ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గద్వాల మండలం చేనుగోనుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ కు రూ 500 సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాని అర్హులైన వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని తెలియజేశారు. ఇటీవలే రైతు భరోసా పంటల పెట్టుబడి సాయాన్ని ఎకరా లోపు పొలం ఉన్న రైతులకు ఇవ్వడం జరిగిందని, మిగతా రైతులకు కూడా దశలవారీగా రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఉండే బాల్యవివాహాలు, ఇతర సామాజిక సమస్యలపై ప్రతి ఒక్క పౌరులు స్పందించి వాటి నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామ సభను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పద్మమ్మ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. గ్రామంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారుల వివరాలను తెలియజేశారు. అలాగే పలువురు లబ్ధిదారులు సంక్షేమ పథకాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, మండల ప్రత్యేక అధికారి నూకరాజు, డిఎల్ పిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ హరికృష్ణ, ఇన్చార్జి ఎంపీడీవో చంద్రకళ, హౌసింగ్ డిఇ కాశీనాథ్, ఉప సర్పంచ్ రాముడు, పంచాయతీ కార్యదర్శి రామ నర్సింహులు, వివిధ శాఖల ఇతర అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.