ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే నిర్వహణ
ఉర్దూ మీడియం పాఠశాలల నిర్వహణలో మార్పులు
రంజాన్ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు స్కూళ్లు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఒంటిపూట బడులపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే బడులు నడపాలని అన్నియాజమాన్యాలను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 12:30 గంటల సయమంలో మధ్యాహ్న భోజనం అందజేయాలని సూచించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని పేర్కొన్న విద్యాశాఖ.. జూన్ 12న పాఠఃశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది.
ఉర్దూ మీడియం పాఠశాలల తరగతుల సమయాల్లో మార్పు:
రంజాన్ సందర్భంగా పాఠశాల సమయాల్లో తెలంగాణ విద్యాశాఖ మార్పులు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలలో టైమ్ టేబుల్ చేంజ్ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే వారంలో ఒక రోజు అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.