ముద్ర, శేరిలింగంపల్లి :
హోలీ పండుగ సందర్భం గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఎం. రమేష్, ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 3, 2026 (మంగళవారం) ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఎక్సైజ్ చట్టం – 1968, సెక్షన్ 20 ప్రకారం జారీ చేసిన ఈ ఉత్తర్వుల మేరకు కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు మూసివేయబడతాయి. అయితే స్టార్ హోటళ్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.