జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలిన….
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉదేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో మరియు జిల్లాలో అకాల వర్షాలు ఉన్నందున వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు గన్ని సంచులు, టార్ఫలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పరిశీలనలో ఆర్డీవో నరసింహ రావు, సివిల్ సప్లైస్ డిఎం జితేంద్ర ప్రసాద్ , తహసీల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లులను పరిశీలించిన పోలీస్ అధికారులు…
జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యల్లో భాగంగా గురువారం పోలీసులతో కలిసి అధికారులు పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఎస్‌ఐలు, సంబంధిత ఎంపీడీఓలు, ఎంఆర్వోలు, ఏపీఎంలు, ప్యాక్స్ సీఈఓలు మరియు పోలీసు అధికారులు సంయుక్తంగా పలు వరి కొనుగోలు కేంద్రాలు (PPCలు), రైస్ మిల్లులను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి ధాన్యం సేకరణ, వరి అన్‌లోడింగ్ ప్రక్రియ, రవాణా వాహనాల కదలిక, వరి నిల్వ విధానం, మిల్లులకు తరలింపు తదితర అంశాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు సజావుగా సాగుతున్నాయా లేదా?, అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందా లేదా?, తూకం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నారా అనే అంశాలను అధికారులు పరిశీలించారు.