పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది…
ఎంపీ అరవింద్ పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోము….
ముద్ర ప్రతినిధి, జగిత్యాల :
ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మానుకోవాలని, పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుందని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డా.భోగ శ్రావణి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము నిజాలు చెప్పినప్పటికీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము దీక్ష చేస్తున్న విషయం గురించి మాట్లాడితే అది పక్కనపెట్టి తమను ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు తాము వాస్తవాలు మాట్లాడితే అది పక్కనపెట్టి పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుందన్నారు. జగిత్యాలలో ఉన్న అటూ ఇటూ కానీ నాయకులు సైతం తాము చెప్పిన నిజాన్ని ఒప్పుకోవడం లేదని విమర్శించారు. వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసమే, వారు భూములు, జాగలు మరింత పెంచుకోవడానికే దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్నారన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న విద్యా సంస్థలకు మాత్రమే స్థలాలు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యాసంస్థలకు స్థలం లేదని సాక్షాత్తు ఎమ్మెల్యే అనడం హాస్యస్పదంగా ఉందన్నారు. ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు వారి కనీస అవసరాలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంటుందని, దాన్ని గుర్తుంచుకొని నడుచుకోవాలని హితువు పలికారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రాన్ని ఒప్పించి ఇక్కడ కేంద్ర విద్యాలయం ఏర్పాటు చేయడానికి మంజూరు తీసుకువస్తే అదేమి ఇక్కడ విద్యార్థులకు అవసరం లేనట్టు ఎమ్మెల్యే ప్రవర్తించడం సరికాదన్నారు. సీబీఎస్సీ విద్యను ఇక్కడ విద్యార్థులకు దూరం చేసే కుట్రను స్థానిక ఎమ్మెల్యే పన్నుతున్నట్లు తమకు అనుమానం ఉందన్నారు. ఇక్కడ పాఠశాల ఏర్పాటు జరిగితే ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు, బీజేపీ నేతలకు మంచి పేరు వస్తుందోనని భయంతో ఇక్కడి ఎమ్మెల్యే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ మీట్ చూస్తే అసలు ఇక్కడ కేంద్ర విద్యాలయం ఎందుకు మంజూర అయిందోనని బాధతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పిండేరు భానుప్రియ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.