Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి vs తెలంగాణ పోలీస్‌

ఎట్టకేలకు వివాదానికి ఫుల్‌స్టాప్
వార్నింగ్ తో వెనక్కు తగ్గిన గులాబీ నేత

ముద్ర, తెలంగాణ బ్యూరో:
నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈసారి మరింత తీవ్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన చేసిన పనికి పోలీసు అధికారుల సంఘం, ఐపీఎస్ అసోసియేషన్ బహిరంగ ప్రకటనలు విడుదల చేశాయి. కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలంటూ,బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వార్నింగ్‌లు ఇచ్చాయి. దీంతో అధిష్టానం పెద్దల సూచన మేరకు కౌశిక్ రెడ్డి ఒక అడుగు తగ్గి తన వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించాలని ప్రత్యేకంగా వీడియో మెసేజ్ విడుదల చేశారు. ఈ వీడియోతో వివాదం తాత్కాలికంగా ముగిసింది.
గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని వీణవంక మినీ మేడారం జాతరకు తన భార్య, కూతురు, కొందరు అనుచరులతో సమ్మక్కా, సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో ఆలయం వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. వాహనాలు వదిలి నడుచుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. కౌశిక్ రెడ్డి ఆందోళన చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న ఆయన గద్దెల వద్దకు వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకోవడంతోపాటు బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలోనే పెనుగులాట చోటు చేసుకుంది. ఇలా కౌశిక్ రెడ్డి వర్సెస్ పోలీసుల రచ్చ పెను దుమారం రేపింది. అసెంబ్లీ స్పీకర్‌ను కలసి ఎమ్మెల్యేనైన తన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారని, తన భార్యతో మరో దళిత మహిళా సర్పంచ్‌ను సైతం సీపీ,ఏసీపీ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డి. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

కౌశిక్ రెడ్డి ఆరోపణలు తీవ్రంగా ఖండించిన ఐపిఎస్ అసోసియేషన్
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఐపీఎస్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఐపీఎస్ అసోసియేషన్. ఎమ్మెల్యే చేసేది ఆధారాలు లేని దురుద్దేశ పూరకంగా ఆరోపణలు మాత్రమేనంటున్నారు. ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను మతం పేరుతో దూషించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అధికారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, మత మార్పిడి వంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ఈ ఘటన సివిల్ సర్వీసుల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా ఉందన్నారు.

తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలను, ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ లేఖ విడుదల చేసింది తెలంగాణ పోలీసు అధికారుల సంఘం. గౌరవ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్న పోలీసుల పట్ల ఎమ్మెల్యే చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గుంపులుగా వెళ్లి, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం దురదృష్టకరమన్నారు. అక్కడి శాంతి భద్రతల గురించి, కోర్టు ఉత్తర్వుల గురించి ఎమ్మెల్యేకి వివరించినప్పటికీ వారు అనుచితంగా ప్రవర్తించారని అన్నారు. మహిళా పోలీసు అధికారులపట్ల కూడా దురుసుగా ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం సరికాదన్నారు.
ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండి పోలీసు అధికారుల మత ప్రస్తావన తేవడం అత్యంత గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం అంది. పైగా అక్కడ లేని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఉద్దేశించి, మత ప్రస్తావన చేస్తూ చేసిన వ్యాఖ్యలు హేయమని, కేవలం పబ్లిసిటీ కోసం వివాదాలు సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతల పట్ల మరింత గౌరవంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల పట్ల, శాంతి భద్రతల పట్ల నిబద్ధతతో విధులు నిర్వర్తిసున్న తెలంగాణ పోలీసుల ఖ్యాతిని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. అలాంటి వ్యవస్థ మీద మతపరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత గర్హనీయమని, ఈ ఘటనను పోలీసు వ్యవస్థ మనోబలాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణిస్తామన్నారు. ఇలాంటి చర్యల పట్ల పోలీసు శాఖ తీవ్రంగా వ్యవహరిస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చట్ట ప్రకారం చర్యలకు తీసుకుంటామని, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే తన అసంబద్ధ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దిగొచ్చిన కౌశిక్ రెడ్డి.. పోలీసు అధికారులకు క్షమాపణలు..
ఓవైపు ఐపీఎస్ అసోసియేషన్ , మరోవైపు తెలంగాణ పోలీసు అధికారుల సంఘం సీరియస్ అవ్వడంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గారు. పోలీసులు అధికారులంటే తనకు గౌరవం ఉందని, ఐపీఎస్ అధికారులను తప్పుగా మాట్లాడలేదని, ఉద్దేశపూరకంగా అవమానించలేదని, క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. మమ్మల్ని అడ్డుకోవడంతో ఫ్రస్ట్రేషన్ ఒత్తిడితో తెలియకుండా నోరు జారాను తప్ప, ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదన్నారు కౌశిక్ రెడ్డి. నా మాటల వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు. తప్పుడు ప్రచారం చేయొద్దని, ఈ వివాదం ఇక్కడితో ముగించాలని కోరారు కౌశిక్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.