లడ్డూల్లో నెయ్యి పేరుతో కెమికల్స్ వినియోగం –
‘క్లీన్ షీట్’ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, గత ఏడాది టీటీడీలో నెయ్యి సరఫరా పేరుతో జరిగిన కుంభకోణంపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించిందన్నారు.
సిట్‌పై నమ్మకం లేదంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా పర్యవేక్షిస్తూ సీబీఐకి అప్పగించిందని మంత్రి గుర్తు చేశారు.
ప్రస్తుతం చార్జ్ షీట్ దాఖలైన నేపథ్యంలో, “మాకు క్లీన్ షీట్ వచ్చిందని” అంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆర్థిక లబ్ధి కోసం సుమారు 60 లక్షల లీటర్ల నెయ్యి పేరుతో ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా, గీ వాసన వచ్చేలా కెమికల్స్‌తో తయారు చేసిన పదార్థాన్ని లడ్డూలు, మహాప్రసాదంలో వినియోగించారన్నారు.
ఈ వ్యవహారంలో నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు ₹233 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, ఇది దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు.
సీబీఐ సమర్పించిన నివేదికలో, శాంపిల్ సైజ్ చిన్నదిగా ఉండటం వల్ల కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయినప్పటికీ, సరఫరా చేసిన పదార్థంలో అసలు ‘గీ’ అనే పదార్థమే లేకుండా, కేవలం గీ వాసన వచ్చేలా కెమికల్స్ కలిపినట్లు నిర్ధారణకు వచ్చిందని మంత్రి తెలిపారు.
ఈ దర్యాప్తు నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని, అందులో ఎక్కడా “క్లీన్ షీట్”
అనే మాటకు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతలు పండగలు చేసుకుంటూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై దాడులు చేయడం సమాజానికి సిగ్గుచేటు అన్నారు.
ప్రతిపక్ష నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయకుండా, వాస్తవాలను పూర్తిగా తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో, పారదర్శకంగా, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుపుతోందని, ఎంక్వైరీ నివేదికలు మరియు సీబీఐ రిపోర్టులు ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలే నిజానిజాలు అర్థం చేసుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడడం మన అందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.