రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు
త్వరలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సర్టిఫికేషన్, ప్రతిజ్ఞ విధానం అమలు
మంత్రి పొన్నం ప్రభాకర్
అలియా ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా , ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సర్టిఫికేషన్, ప్రతిజ్ఞ విధానాన్ని ట్రాన్స్‌పోర్ట్ శాఖ అమలు చేయనుందని చెప్పారు. గతనెల ఒకటో తేది నుంచి శనివారం వరకు రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ అలియా మోడల్ హై స్కూల్‌లో ట్రాఫిక్ అవగాహన పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రోడ్డు భద్రత సమాజం మొత్తం బాధ్యత అన్నారు.రోడ్డు ప్రమాదాలతో ప్రతిరోజూ సగటున 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ భద్రతను పాఠశాల స్థాయి నుంచే ఒక సక్రమ విద్యా అంశంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే తరహా ట్రాఫిక్ అవగాహన పార్కులను ఇతర పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి వాహనదారులు హెల్మెట్ ను తప్పక వాడాలని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 7వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు,వృద్ధ వయస్సు గలవారు అధికంగా ఉన్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు రక్షణ కు తప్పక హెల్మెట్ వాడడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ మాసం సందర్భంగా 64 ప్రభుత్వ, 117 ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 181 పాఠశాలల్లో 24,648 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఏడాది పొడవునా అవగాహన కొనసాగితే ప్రమాద మృతుల్లో గణనీయమైన తగ్గుదల సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ, ట్రాఫిక్ అవగాహన పార్క్ ఒక “లివింగ్ క్లాస్‌రూమ్”లా పనిచేస్తుందని చెప్పారు. పుస్తకాలకే పరిమితం కాకుండా ఆటలు, అనుకరణల ద్వారా రోడ్డు సూచికలు, పాదచారి ప్రవర్తన, సైక్లింగ్ క్రమశిక్షణ, హెల్మెట్ భద్రత వంటి అంశాలను పిల్లలు ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. హైదరాబాద్ అధిక ప్రమాద ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో, నగరాన్ని ఆదర్శ రోడ్డు-సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి బాధ్యత అవసరమని పిలుపునిచ్చారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు కుటుంబాలపై తీవ్ర దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయనీ ముఖ్యంగా కుటుంబ ఆదాయాధారం కోల్పోతే ఆర్థిక ఇబ్బందులు, పిల్లల విద్యలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. తండ్రులు, తల్లులు మరియు తమకూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ కుటుంబ సభ్యులను ఒప్పించేలా విద్యార్థులు “సేఫ్టీ అంబాసిడర్లు”గా మారాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు చూసి పిల్లలను అభినందించారు. అక్కడున్న వారందరితో రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ ప్రతినిధులు డా. జెలాలెం, డా. శ్రీధర్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, జిల్లా రవాణా అధికారి పురుషోత్తం రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, కార్పొరేటర్ సురేఖ, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడు నవీన్, హైదరాబాద్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సభ్యుడు సురేష్, ట్రాన్స్‌పోర్ట్, విద్య, ట్రాఫిక్ పోలీస్ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు