Take a fresh look at your lifestyle.

తొర్రూరు మున్సిపాల్టీని దత్తత తీసుకుంటా : పొంగులేటి హామీ

పుర’ ఎన్నికలు మా పాలకు రెఫరెండం
మున్సిపల్ ఎన్నిక‌ల‌ను సెమీ ఫైన‌ల్స్ గా భావిస్తున్నాం
ప‌దేళ్ల దొర‌ల‌పాల‌న‌లో పేద‌ల‌కు ఒరిగింది శూన్యం
ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, జ‌న‌గాం జిల్లాల్లో విస్తృత ప్ర‌చారం
కలిసొచ్చేపార్టీలతో ముందుకు పోతాం
 మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ముద్ర, ఖమ్మం/ మహబూబాబాద్ :

ఈ నెల 11న రాష్ట్రంలో జ‌రగనున్న మున్సిపల్ ఎన్నికలు రెండున్నరేళ్ల తమ కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తోంద‌ని చెప్పారు. పుర ఎన్నిక‌ల్లో త‌మ‌కు స‌రైన పోటీయే లేద‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన ఇతర పార్టీల పొత్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. కలిసి వచ్చే పార్టీలకు కాంగ్రెస్ తలపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. గొంతెమ్మ కోరికలు కోరకుండా కలిసి వచ్చే ప్రతి రాజకీయపార్టీని కాంగ్రెస్ గతంలో మాదిరిగా కలుపుకుని పోతుందన్నారు. శనివారం పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం , మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వర్ధన్నపేట జనగాం మున్సిపాలిటీల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఆనాటి పాలకులు తమ అకౌంట్లు నింపుకోవాలని చూశారే తప్ప, సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించరు. రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి, కేవలం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తమ కళ్లముందే కూలిపోతోందన్నారు. ఇది వారి అవినీతికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. రెండు సార్లు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిన చరిత్ర వారిదని ఎద్దేవా చేశారు. ఇటీవల నిర్వహించిన పంచాయితీ రాజ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మంచి ఆధిక్య‌త వ‌చ్చింద‌న్న ఆయన పుర‌పాలిక‌ల్లో కూడా అలాంటి ఫలితాలేపున‌రావృతం కాబోతున్నాయన్నారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి మెలిసి మ‌మేక‌మై ప‌నిచేసే వారికే కార్యకర్తలకే కాంగ్రెస్ టిక్కెట్లు ఇస్తున్నామ‌ని అన్నారు. త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌కు కాంగ్రెస్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌ని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతి ఎన్నిక‌ను ప్ర‌భుత్వ ప‌నితీరుకు రిఫరెండం అని ప్ర‌క‌టించి భంగప‌డ్డార‌న్న ఆయన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ప్రజలు వారిని తిరస్కరించారని గుర్తు చేశారు. ఈసారి కూడా ఆ దొర‌వారు భంగ‌ప‌డితే ఏం చేస్తారో చెప్పాల‌ని మంత్రి పొంగులేటి ప్ర‌శ్నించారు. తొర్రూరు పట్టణంలో ప‌ర్య‌టించిన పొంగులేటి… ఆ మున్సిపాల్టీని తాను ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న తాను త‌న నియోజ‌క‌వ‌ర్గంతో స‌మానంగా ఈ మున్సిపాల్టీని అభివృద్ది చేస్తాన‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అన్నిసంక్షేమ ప‌ధ‌కాలు చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్క‌డ ఎమ్మెల్యే, ఎంపీతో స‌హా అంద‌రూ కాంగ్రెస్ వారేన‌న్నారు. తొర్రూరు పుర‌పాలిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిని గెలిపిస్తే ప్ర‌గ‌తి ప‌ధ‌కాల అమ‌లు మ‌రింత సులువు అవుతుంద‌న్నారు. ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతి అనే విష‌యం గ‌డ‌చిన రెండేళ్ల‌లో అమ‌లు చేస్తు్న్న ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంతో పాటు వివిధ పధ‌కాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెబుతూ కాంగ్రెస్ అభ్య‌ర్ది శ్ర‌వ‌ణ్‌ను గెలిపించాల‌ని మంత్రి పొంగులేటి కోరారు.

Leave A Reply

Your email address will not be published.