- జీరో బిల్లులు, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా పథకాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి.
- శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ముద్ర, మధిర : అందరి ఇండ్లలో జీరో కరెంట్ బిల్లులు వస్తున్నాయా, రైతు భరోసా డబ్బులు పడ్డాయా, మీకు వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తున్నాయా అంటూ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న తీరు,తెన్నులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరా తీశారు. మధిర నియోజక పరిధిలోని ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామంలోని ఓం శ్రీ పార్వతి సమేత అమృత లింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలలో భాగంగా గత మార్చి నుంచి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిందని 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడుతున్న గృహ వినియోగదారులకు జీరో బిల్ వస్తుంది అన్నారు. అయితే ఈ పథకం ద్వారా కాచవరం గ్రామంలో ఎంత మంది లబ్ధి పొందుతున్నారు? విద్యుత్తు సరఫరా ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని గ్రామస్తులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాచవరం గ్రామానికి సంబంధించి జీరో బిల్లులు మరియు వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించిన విద్యుత్తు సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల పక్షాన 31 లక్ష రూపాయలు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందని ఏఈ అనూష ఉపముఖ్యమంత్రి కి వివరించారు. అక్కడ ఉన్న రైతులను ఉద్దేశించి రైతు భరోసా డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా అని అడుగగా నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులు అందరికీ రైతు భరోసా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని సమాధానం చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద వంటగ్యాసు సిలిండర్ ప్రభుత్వం 500 రూపాయలకే ఇస్తుందని, సబ్సిడీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో పడుతున్నయా అని మహిళలను ఆరా తీశారు. గ్రామంలో 90 మంది కుటుంబాలకు వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు వచ్చాయని మహిళలు చెప్పారు. పొదుపు సంఘం లో ఉన్న మహిళలకు ఇందిరమ్మ డైరీ పథకంలో సబ్సిడీపై గేదెలను ఇస్తామని చెప్పారు. కాచవరం గ్రామంలో రేషన్ షాపు లేనందున లక్ష్మాపురం గ్రామానికి వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని గ్రామంలోనే రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. కొంతమంది మహిళలు తమకు ఇల్లు లేవని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని ఉప ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి అయ్యిందని గ్రామంలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ కమిటీలు పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
- చూస్తానో లేదో అనుకున్న
ఎండలకు పాణం బాగుండట్లేదు. నిన్ను చూస్తానో.. చూడనో అనుకున్నా. నెల రోజుల నుంచి నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటున్నది. సార్ వస్తే నా ఇంటికి తీసుకురమ్మని మన నాయకులకు చెప్పాను. పండుగ రోజున నన్ను చూడడానికి నా ఇంటికి వచ్చి పలకరించినవ్. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆలింగనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కేఎస్ నర్సమ్మ భావోద్వేగానికి గురైంది. నరసమ్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నావా? ఆరోగ్యం ఎట్లా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. ఉగాది పండుగ నాడు కాచవరం గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు మహిళలు మంగళహారతులు పట్టారు.
