ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :
ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్ మండల పరిధిలోని ఏల్లుపేట గ్రామంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే నల్ల పోచమ్మ,దుర్గమ్మ,గ్రామ దేవతల జాతర మహోత్సవలో భాగంగా రెండవ రోజు శుక్రవారం నాడు ఉదయం గ్రామ దేవతామూర్తుల దేవాలయాల చుట్టూ డప్పు చప్పులతో చిందుల విన్యాసాలతో కుల మతాలకు అతీతంగా పచ్చి మట్టి కుండలతో బోనాలు కుదించి అందులో పెరుగు నైవేద్యాన్ని పెట్టి శివసత్తుల నృత్యలతో గ్రామ పురవీధుల గుండా గ్రామదేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహించారు.

భక్తులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు అంగరంగ వైభవంగా సినిమాలను తలపిస్తున్న విధంగా కుస్తీ పోటీలు నిర్వహించారు.ఇందులో కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని ఐదు తులాల వెండి కడెం కుస్తీ పోటీలో మల్ల యోధులు తలపడ్డారు.చివరి కుస్తీ జుక్కల్ కు చెందిన మారుతి,కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ మల్లయోధుల కుస్తీ హోరా హోరిగా కొనసాగింది. చివరకు అంతాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ పైల్వన్ కుస్తీ గెలుపొందాడు. గెలుపొందిన కుస్తీ ఫైల్వాన్ కు గ్రామ సర్పంచ్ మాదవి నరసింహారెడ్డి,ఉప సర్పంచ్ కుమ్మరి లక్ష్మయ్య చేతుల మీదుగా శాలువా కప్పి ఐదు తులాల వెండి కడెంను బహుకరించారు.అనంతరం అమ్మవారి దీవెనలు తీసుకున్నారు.సాయంత్రం పాచిపండ్ల ఊరేగింపు చేశారు.ఈకార్యక్రమంలో గ్రామపాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.