మాదాపూర్, ముద్ర విలేఖరి: ‘తెలంగాణ వ్యవసాయం- రైతు సమస్యలు’ అనే అంశంపై బుధవారం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిర్వహించే ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి తెలంగాణ వ్వవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు హాజరౌతారని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు టి-సాట్ నిపుణ ఛానల్ లో ప్రసారమయ్యే లైవ్ కార్యక్రమంలో ఛైర్మన్ తో పాటు సభ్యులు పాల్గొని తెలంగాణలో రైతు సంక్షేమం- కమిషన్ పర్యవేక్షణపై వివరించనున్నారని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో పాటు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపైనా చర్చించి రైతుల ప్రశ్నలకు సమాధానాలిస్తారన్నారు. తెలంగాణలోని రైతులు, రైతు, వ్యవసాయ కూలీలు తమ తమ సందేహాలకు సమాధానాల కోసం 040-23540326/726 టోల్ ఫ్రీ నెం.1800 425 4039 లకు ఫోన్ చేయాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రత్యేక చర్చా కార్యక్రమం టి-సాట్ శాటి లైట్ ఛానళ్లతో పాటు యూట్యూబ్, యాప్ లోనూ ప్రసారమౌతోందని గుర్తుచేశారు.