- ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కులు.
- రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులకు మారుబెనీ సంసిద్ధత.
- టోక్యోలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఇరుదేశాల అధికారుల సంతకాలు.
- సీఎం జపాన్ పర్యటనలో తొలిరోజే కీలక పెట్టుబడుల ఒప్పందం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటన ఫలితమిస్తోంది. పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ లో పర్యటిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం తొలి రోజే ఆ దేశంతో కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ రైజింగ్ టీం చర్చలతో జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ సంసిద్ధత తెలిపింది.ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని గురువారం టోక్యోలో కలుసుకున్నారు.ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు.దీంతో దాదాపు రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే అంచనాలున్నాయి.మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది.అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపట్డనున్నారు.
- మారుబేని పూర్తి సహకారం.
హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనికి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం..ఆ కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు మారుబేనిదేనని చెప్పారు.ఆ పార్కు ఏర్పాటుతో తెలంగాణలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. జీవనోపాధి మెరుగుపడుతుందని వెల్లడించారు.తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని మారుబేనికి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబేని పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు.భారత దేశంతో జపాన్ కు ఏళ్లకేళ్లుగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సీఎం మాటిచ్చారు.తెలంగాణ, హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతకు మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా అభినందించారు.తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు.అక్కడున్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని అన్నారు.కాగా మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ మరియు మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది.
- సోనీ ప్రధాన కార్యాలయం సందర్శన.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది.సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఉత్పత్తులతో పాటు వారి పని తీరును తెలంగాణ బృందానికి వివరించారు.ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌పై వివరణాత్మక చర్చలు జరిపింది.యానిమేషన్, వీఎఫ్ఐ మరియు గేమింగ్ రంగాలలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది.ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు విజన్ ను వారితో పంచుకున్నారు.
