Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా : మాజీ మంత్రి హరీశ్ రావు

 
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తా

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలు, పాలకుల వ్యతిరేక విధానాలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వదృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి, కార్మికులకు అన్యాయం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హరీశ్ రావును కలిసిన టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కార్మిక సంఘ నేతలకు హామీ ఇచ్చారు. కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు అప్పగించిన ప్రభుత్వం వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. జీరో టికెట్ అమలు కోసం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు అరకొర నిధులు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయమన్నారు. గత రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని ఆర్టీసీపైనే మోపడంతో సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందన్నారు. సంస్థ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయన్న హరీశ్ రావు 2025 పీఆర్సీ సైతం అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ… ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ‘అపాయింటెడ్ డే’ ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు దక్కాల్సిన పదోన్నతులు, ఉద్యోగ భద్రత, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు వంటి హక్కులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమను చూపించకుండా.. తక్షణమే రూ.2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన బలంగా వినిపిస్తామని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచైనా పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా పోరాడుతామని హరీశ్‌రావు ఆర్టీసీ కార్మిక సంఘ నేతలకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.