Take a fresh look at your lifestyle.

తెలంగాణకు 500 మల్టీనేషనల్ కంపెనీలు తెస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టే – పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ హామీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ప్రపంచంలో ఉన్న ఐదొందల పెద్ద మల్టీనేషన్ కంపెనీలను తెలంగాణ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయా కంపెనీలకు అవసరమైన స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వ్యాపారం అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే వ్యాపారం అనే స్ధాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి సంస్థలు క్యూ కడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అనువైన పరిస్థితులు, మానవ వనరులు సహా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.

దీంతో ఎన్నో గ్లోబల్ కంపెనీలు.. హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా.. విదేశీ వేదికలపై హైదరాబాద్ నగరానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ.. ఆయా కంపెనీలను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌కు వచ్చిందంటే మన నగరానికి హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తమ దృష్టి హాలీవుడ్‌పైనే ఉందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ రాకతో తన కల నిజం కాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. తాను బాల్యంలో ఉన్నప్పటి నుంచే తనకు సినిమాలు అంటే ఎంతో ఇష్టమని సీఎం వివరించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కార్యాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని.. బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్‌, అరుంధతి వంటి సినిమాలను తీశారని పేర్కొన్నారు. మద్రాకు కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీని ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు.. హైదరాబాద్‌కు తీసుకువచ్చారని గుర్తు చేశారు. కాలంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు విశాలమైన ఆఫీస్ నిర్మించుకునేందుకు కావాల్సిన భూమిని.. కొత్తగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తమ ప్రభుత్వం రెడీగా ఉందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీకి నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్ ఆఫీస్‌ను తీసుకురావాలని కోరుతున్నట్లు చెప్పారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఐలైన్ స్టూడియో సీఈఓ జెఫ్ షపిరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సినీ నటుడు, నిర్మాత రాణా దగ్గుబాటి, తెలంగాణ ఫిలిం డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.