-ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
-జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లాలో గృహ వినియోగ ఎచ్ పి గ్యాస్ సరఫరా విధానం సక్రమంగా జరగాలనిజిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు, పంపిణీ విధానం, బుకింగ్ ప్రక్రియ వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సరఫరా జరుగుతున్నదా అనే అంశాలను కలెక్టర్ పరిశీలించారు. గ్యాస్ బుకింగ్ నుండి డెలివరీ వరకు నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సెంటర్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని, ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. ఈ పరిశీలనలో డి ఎం సి ఎస్ మురళి కృష్ణ, డి ఎస్ ఓ సుదర్శన్, సంబంధిత శాఖ అధికారులు మరియు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.