ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ అంశంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపల్ వార్డులో సభలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలతో ప్రభుత్వం అనుసంధానంగా పనిచేస్తూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి గ్రామ సభ, వార్డు సభకు ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల వివరాలతో కరపత్రాలు సిద్ధం చేసి పంపిణీ చేయాలని, గ్రామాలు–వార్డుల అభివృద్ధి ప్రాధాన్యతలు, సమస్యలు గుర్తించి పరిష్కార మార్గాలపై చర్చించాలని సూచించారు. ఇప్పటివరకు సాధించిన పురోగతి, పరిష్కరించిన పెండింగ్ అంశాల వివరాలు ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
జిల్లాలో పూర్తి ఏర్పాట్లు: కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామ సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2న జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, 4 మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించనున్నట్లు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభలకు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాలు, యువత, రైతులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సభల నిర్వహణకు అవసరమైన ఫ్లెక్సీలు, షామియానాలు, త్రాగునీరు, ఎల్ఈడీలు, సౌండ్ సిస్టమ్, తెలంగాణ జాతీయ గీతం వంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని చెప్పారు.
అదేవిధంగా రానున్న రోజుల్లో అమలులోకి రానున్న సంక్షేమ పథకాలపై గ్రామ సభల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా, దివ్యాంగ విద్యార్థినీలకు ద్విచక్ర వాహనాల వంటి పథకాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, అమరేందర్, జిల్లా పరిషత్ సీఈఓ దేవా సహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.