- ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర సర్కార్.
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు చాల భయంకరమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, నాయకులు, సోషల్ మీడియా టీమ్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. జడ్జిలు, వ్యాపారస్తులు, సినీనటులు, ప్రతిపక్ష నాయకులు, ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేశారన్నారు.అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ జరిగింది. దీనిలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, హామీలను నెరవేర్చకుండా వైఫల్యం చెందిన విషయాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన సూచించారు. మండల కమిటీలు, జిల్లా కమిటీల నుంచి వచ్చిన నూతన నాయకత్వం రానున్న రోజుల్లో ఉద్యమాలతో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన తెలంగాణను అప్పుల్లో ముంచిందన్నారు.