Take a fresh look at your lifestyle.

గేమ్ చేంజర్ గా ‘హెచ్ సిటీ’

  • దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా హైదరాబాద్​.
  • బడ్జెట్ లో రూ.10వేల కోట్లు కేటాయించాం.
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరాభివృద్ధిలో “హెచ్ – సిటీ” ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వానికి సంకల్పానికి ఇది దిక్సూచిగా మారుతుందన్నారు.”హెచ్- సిటీ” ప్రాజెక్ట్ లో భాగంగా రూ.45 కోట్లతో ఎన్ హెచ్ 65 నుంచి అమీన్ పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు ఆయన గురువారం చందానగర్ లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్​ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రూ.7032 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే హెచ్-సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వివరించారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, పర్యావరణహితంగా నగరాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలన్నారు.రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో నగరంపై పడుతున్న ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందనీ నగరవాసులకు సౌకర్యమంతమైన నాణ్యమైన జీవన శైలి అందుతుందని చెప్పారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో వేయి ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించామనీ అదనంగా మరో 800 బస్సులను తీసుకురావాలని సంకల్పించినట్లు వివరించారు. ఇందుకు కేంద్రం సైతం సహకరించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలక ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.హైదరాబాద్ అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా నలువైపులకు విస్తరిస్తామని శ్రీధర్​ బాబు తెలిపారు.మాపై కొందరూ పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంచి చేయాలని సంకల్పిస్తే హెచ్ సీయూ భూములు విషయంలో విపక్షాలు ఏం చేశారో గమనించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.