ముద్ర ప్రతినిధి, మెదక్:
టాక్స్ లు పెంచే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. సోమవారం మెదక్ పురపాలక సంఘం మొదటి సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ఆదాయ వనరులు వేరే రకంగా సమకూర్చుకోవాన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమలు, ఈగలు నివారణ,శానిటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు. 70% కొత్త వారు కౌన్సిలర్లుగా ఎన్నికైనందున అధికారులతో పరిచయం, శిక్షణ ఇప్పించాలన్నారు. పార్టీలకతీతంగా మెదక్ నియోజకవర్గం, మెదక్ పట్టణం అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. మిషన్ భగీరథ కాలేశ్వరం, పేరుతో బీఆర్ఎస్ మోసం చేసింది అన్నారు. నేడు మళ్ళీ తాగునీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంకులు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని కమిషనర్ కు సూచించారు. స్వీపింగ్ మిషన్ వాడాలని, మరమ్మతులంటే చేయించాలని తెలిపారు. సీసీ రోడ్లకు ప్రాముఖ్యత ఇచ్చి వార్డులో నిర్మించాలన్నారు. కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చిన అంశాలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ… కొత్తగా గెలుపొందిన కౌన్సిలర్లకు విధులు, బాధ్యతల గురించి తెలియాల్సిన అవసరం. వార్డులో పార్టీలకతీతంగా అందరికీ పనిచేయాలని కౌన్సిలర్లకు సూచించారు. మా వంతు సహకారం అందిస్తామన్నారు. పట్టణంలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మెదక్ 9వ వార్డులో పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ కోరారు. వార్డులో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు స్పందించి, ట్యాక్స్‌ను పెంచొద్దని కమిషనర్‌కు ఆదేశించారు. శానిటేషన్ సమస్య లేకుండా వార్డును పరిశుభ్రంగా ఉంచాలని, సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కౌన్సిలర్ తొడుపునూరి శివరామకృష్ణ మాట్లాడుతూ రైతు బజార్ వద్ద పార్కింగ్ సమస్య ఏర్పడుతున్నందున సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ వెంకటరమణ మాట్లాడుతూ కౌన్సిలర్లకు విధుల పట్ల అవగాహనతో పాటు సంబంధిత అధికారులతో పరిచయం ఏర్పాటు చేయాలన్నారు.
చైర్ పర్సన్ కాను రాధిక భూపతిరాజ్ మాట్లాడుతూ… అందరి సహకారంతో పట్టణ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.