Take a fresh look at your lifestyle.

నిర్మల్ గుట్టలపై రాగాలు పలికే అరుదైన రాళ్లు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా గుట్టలపై పలుచోట్ల శబ్దం వచ్చే అరుదైన రాళ్లను గుర్తించినట్లు కవి, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. తమ పరిశోధనలో వెల్లడైన విషయాలను ఆయన వివరిస్తూ ఈ రాళ్లను అరుదైన భూభౌతిక వారసత్వంగా సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికులు వీటిని “కంచు బండలు”గా పిలుస్తున్నారన్నారు. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల పైకి వచ్చిన లావా గట్టిపడి బసాల్ట్ శిలలుగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన కొన్ని శిలలు ఘన నిర్మాణం కారణంగా శబ్ద తరంగాలను విడుదల చేస్తాయని అన్నారు.
ఈ శిలలను శాస్త్రీయంగా లిథో ఫోన్స్ అని పిలుస్తారని, దీన్ని మరొక రాయితో లేదా పనిముట్లతో కొట్టినప్పుడు కంచు మ్రోగినట్లుగా స్వరాలు వినిపిస్తాయన్నారు. అందువల్ల ఇవి “రింగింగ్ స్టోన్స్” లేదా “రాగాలు పలికే రాళ్లు”గా ప్రసిద్ధి చెందాయి.
జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. జ్ఞాన సరస్వతి ఆలయం బాసర వద్ద “వేద శిల”గా పిలువబడే రాయి కూడా ఇలాంటి స్వరాలు పలికే బసాల్ట్ శిలగా భావిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ ఖిల్లా గుట్ట పడమర వైపున్న రాళ్ల శ్రేణిలో పెద్ద రాయి కూడా స్వరాలు పలికే లక్షణం కలిగి ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న ఈ అరుదైన రాళ్లను జియో-హెరిటేజ్ స్పాట్‌గా అభివృద్ధి చేసి సంరక్షించాలని తుమ్మల దేవరావు కోరారు. ఈ క్షేత్ర పర్యటనలో నేరెళ్ల హన్మంత్, అబ్బడి రాజేశ్వర్ రెడ్డి, దొంతుల భీమేష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.