కాంగ్రెస్-బారాస వర్గాల మద్య పెరుగుతున్న వైశమ్యాలు
నిలిచిన పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు – ముందుకు సాగని రోడ్డు వెడల్పు
అభివృద్ధి పై నీలి నీడలు

ముద్ర, ఆత్మకూర్ (ఎం):
ఆత్మకూర్ మండల కేంద్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భారాస పోటా పోటీ ఆరోపణలో గ్రామంలో రాజకీయ పోటీ వాతావరణం నెలకొంది. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు తోడుగా భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలు చేస్తున్న అవకాశవాద మద్దతుతో నాయకులు, కార్యకర్తల మద్య వైశమ్యాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా రాజకీయ పార్టీల మధ్య దూరం పెరిగి అభివృద్ధి, సమన్వయంపై భవిష్యత్ లో మరింత ప్రభావం చూపే అవకాశాలున్నాయని పుర ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎం) మండల కేంద్రం గత పది సంవత్సరాల కాలంలో రాజకీయ చైతన్యంతో పాటు అభివృద్ధిలోనూ అనూహ్యంగా దూసుకెళ్లింది. భౌగోళికంగా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల ముగింపు కేంద్రం కావడంవల్ల వ్యాపార కార్యకలాపాల్లో క్రియాశీలకంగా మారింది. నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రముఖులు మండల కేంద్రమైన ఆత్మకూర్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకోగా భారాసా స్వల్ప తేడాతో జేజిక్కించుకుంది.
14 వార్డుల్లో ఏడు వార్డులు కాంగ్రెస్, నాలుగు భారాసా, మూడు భాజాపా గెలుపొందగా భారాసా మిత్ర పక్షంగా వ్యవహరించిన భాజాపా సర్పంచ్ ఓటుతో ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకుంది. అధికారం, స్థానిక ఎమ్మెల్యే తోడ్పాటు ఉన్నప్పటికీ సర్పంచ్ పదవి చేజారిందన్న ఆవేదన కాంగ్రెస్ వర్గాల్లో, గత ఐదేళ్లుగా కాంగ్రెస్ అక్రమాలను అడ్డకుని, గ్రామ ప్రజలకు అండగా నిలిచిన ఫలితంగా సర్పంచ్ పదవి దక్కిందన్న ఉత్సాహం భారాసా శ్రేణుల్లో ఏర్పడింది. ఇక భాజపాకు మూడు వార్డు మెంబర్లతో పాటు ఉప సర్పంచ్ పదవి దక్కడం డబుల్ బోనంజాగా భావిస్తున్నారు. సీపీఐ, సీపీఎం వర్గాలు కాంగ్రెస్ మద్దతుతో పోటీకి నిలిచినప్పటికీ గత వైభవంలో కొంతైనా నిలబెట్టుకోలేకపోయాయి. అధికారం మారిన ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భారాస మధ్య రాజకీయ పోటీతో పాటు వ్యక్తిగత వైశమ్యాలు పెరిగిపోయాయి. సర్పంచ్ పదవి కోల్పోవడంతో ఊహించని పరిణామంతో గత సమావేశాల్లో తీర్మాణించిన అభివృద్ధి పనులు తామే చేసుకుంటామని తాజామాజీ కాంగ్రెస్ సర్పంచ్ నగేష్ పోటీ పడగా అలా సాగనివ్వమంటూ స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ ఎన్నికల అనంతరం జరిగిన సంక్రాంతి సంబరాల్లో గత ఐదు సంవత్సాలుగా హడావిడి చేసిన కాంగ్రెస్ కార్యకర్గలు, స్థానిక నాయకులు పాల్గొనకపోవడం భారాసా విజయోత్సవ ఉత్సాహం కొనసాగినట్టైంది. గ్రామంలో ప్రధాన సమస్యగా ఏర్పడిన మేయిన్ రోడ్డు నుండి ఉన్నత పాఠశాల వరకు రోడ్డు వెడల్పు పనులకు రూ.1.75 కోట్ల డి.ఎం.ఎప్.టి నిధులు తామే మంజూరీ చేయించామంటే, తామే చేయించామంటూ పోటా పోటీగా పనుల పరిశీలన కార్యక్రమాలు చేపట్టి గ్రామంలో ఒక విధమైన పోటీ తత్వం కన్పించేలా చేశాయి. ఉపాధిహామీ నిధులతో ఉన్నత పాఠశాల చుట్టూ నిర్మించే ప్రహరీ విషయంలోనూ ఫిర్యాదులకు వెల్లి పనులు నిలిచిపోయాయి. అంతే కాకుండా మాజీ సర్పంచ్ తమ తల్లిదండ్రులైన కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీపీ జన్నాయి కోడె అమృతమ్మశంకరయ్య స్మారక సంస్కృతిక కార్యక్రమాలు ప్రతి యేటా మాదిరి నిర్వహించేలా చేసిన తొలి ప్రయత్నాన్ని భారాసా వర్గాలు వ్యతిరేకిండం, భారాస మిత్ర పక్షమైన భాజపా మద్దతు పలకడంతో కార్యక్రమాలు ముందుకు సాగాయి. గ్రామంలో పోటీ రాజకీయాలకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. తాజామాజీ సర్పించ్ పదవీ కాలంలో ఇట్టి పన్ను విషయంలో అవకతవకలు జరిగాయని భారాస ఆధారాలు చూపుతుండగా, ప్రస్తుత సర్పంచ్ భర్త చందర్ గౌడ్ పదవీ కాలంలోనే అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆదారాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. తప్పులు చేసింది మీరంటే…మీరని ఆధారాలతో కూడా ఆరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్, భారాసా విమర్షలు చేసుకుంటున్నాయి. వీటికి తోడు మాజీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత పోకడలు, రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామనే భావన, ఎమ్మెల్యే తమ పార్టీయేనని ధీమాతో కాంగ్రెస్ వ్యహరిస్తుండగా గత సర్పంచ్ పాలనపై పోరాట ఫలితంగా తాము సర్పంచ్ పదవి గెల్చుకోగలిగామని, తమ పార్టీకి సరైన ప్రాధాన్యం ఇవ్వకుంటే సహించేది లేదని భారాసా గట్టిగానే పట్టబడుతోంది. ఇక భవిష్యత్ తమదేనన్న భ్రమలో భాజపా, ఉనికి కాపాడుకునేందుకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం అవకాశాన్ని బట్టి పావులు కదుపుతున్నాయి.
అఖిలపక్ష కమిటీ ఏర్పాటు:
గత ఆరు నెలలుగా ఒక రాజకీయ పార్టీ పై మరొకరు అవినీతి విమర్శలు చేసుకుంటూ పోటీ వాతావరణానికి దారితీస్తుండగా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు నిగ్గుతేల్చాని అన్ని రాజకీయపార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. గ్రామ ప్రజలకు ఇంటి పన్ను, ఇంటి నెంబర్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో జరిగిన లాభనష్టాలను తేల్చే బాధ్యతను కమిటీ చేపట్టాలని నిర్ణయించింది.
స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, రాష్ట్రంలో అధికార పార్టీ ఒకే కోవకు చెంది ఉంటే ఏ గ్రామం పట్టణంలోనై అభివృద్ధి ముందుకు సాగాలంటేనే ఆ పార్టీ నాయకుల మద్య సమన్వయం చాలా అవసరం, అలాంటిది సర్పంచ్ ప్రతి పక్ష పార్టీ, ఎమ్మెల్యే అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉప సర్పంచ్ ఉండటం సమన్వయం విషయంలో ఏకాభిప్రాయం సాధిస్తేనే అభివృద్ధి, శాంతి సామరస్యం విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయని స్థానిన సీనీయర్ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.