Take a fresh look at your lifestyle.

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి

  • రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు డి.శ్రీధర్ బాబు.
  • అభివృద్ధి పనులలో భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తాం.
  • పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన.
  • మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.

మంథని, ముద్ర విలేకరి : మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం, రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నామని అన్నారు. గోదావరి నది పై మంథని నుంచి శివారం వరకు 125 కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు,162 కోట్ల రూపాయలతో మంథని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లైన్ రింగ్ రోడ్డు పనులకు, 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, రింగ్ రోడ్డు లో భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి, రింగ్ రోడ్డు వల్ల మంథని, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్ర రాకపోకల పెరుగుతాయని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి వల్ల వాణిజ్యం పెరుగుతుందని, దీని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. మంథని పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడేలా అన్ని హక్కులతో నూతన ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని అన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు మంథని పట్టణంలో జ్యుడీషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.మంథని ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి పరిశ్రమలు ఆకర్షించి స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టించవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ. సురేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.