- కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులకు బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.
- ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ పై ఆరోపణలు చేసిన వారిపై చట్టపర చర్యలుంటాయి.
- జ్యుడిషియల్ విచారణ కమిషన్ ను తప్పుపట్టడం కరెక్ట్ కాదు.
- కాళేశ్వరం ఖర్చుతో సీతారాం సాగర్, దిండి ప్రాజెక్టులు పూర్తయ్యేవి.
- త్వరలోనే కాళేశ్వరం పునరుద్ధరణ చర్యలు.
- మీడియాతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ శ్రేణుల్లో వణుకు మొదలైందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.ఆ నోటీసులకు బయపడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎలాంటి తప్పు..అక్రమాలకు పాల్పడకపోతే నిర్భయంగా విచారణకు హాజరుకావాలని సూచించారు.శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తోన్న జ్యుడిషియల్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉందన్నారు. ఆ సంస్థ విచారణకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ను తప్పుపట్టడం సరైంది కాదని మంత్రి సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు ఏ తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ లో తప్పులు చేసినట్లు నిపుణులు చెబుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలే ఆ ప్రాజెక్టు కింద బాంబులు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్న వారు విచారణ కమిషన్ ముందు హాజరై ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 84 లక్షలతో మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 1.20లక్షల కోట్లకు చేరిందంటూ కాగ్ ఇచ్చిన నివేదికను మంత్రి గుర్తు చేశారు. తుమ్మిడిఎట్టి వద్ద నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు కమీషన్లకు కకుర్తిపడి ఆ ప్రాజెక్టును అక్కడి నుంచి మేడిగడ్డ కు తరలించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎఫ్ ఐ ఆర్ నమోదైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఆ సమయంలో అక్కడ బాంబులు ఉన్నాయా లేదా అని ఎందుకు తేల్చలేదని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.మేడిగడ్డ లో బాంబులు పెట్టారని అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (ఎన్డీఎస్ఏ)పై విమర్శలు చేసిన వారూ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రూ. 38 వేల కోట్లతో పూర్తి అయ్యే తుమ్మిడి హేట్టి ను వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం కు పెట్టిన పైసలతో ఎస్ఎల్ బీసీ, సీతారాం సాగర్, దిండి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరణ చేసేందుకు తమ న్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.