Take a fresh look at your lifestyle.

ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్‌కు భారీ స్పందన

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

 


ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల, నాగర్‌కర్నూల్‌లో నిర్మాణ్ సంస్థ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఈ జాబ్ డ్రైవ్‌కు జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఇన్ఫోసిస్ ఆర్థిక సహకారంతో నిర్మాణ్ సంస్థ మరియు క్యూస్ కార్ప్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో జియో, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్, అపోలో, మెడ్‌ప్లస్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ చిట్స్ సహా 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ఆన్‌స్పాట్ ఇంటర్వ్యూలకు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి మాట్లాడుతూ, నిరుద్యోగ యువత నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభించిందని తెలిపారు. 200 మందికి పైగా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారని పేర్కొన్నారు. అర్హత సాధించిన పలువురికి కంపెనీలు వెంటనే ఆఫర్ లెటర్లు అందజేశాయని వెల్లడించారు.

నిర్మాణ్ సంస్థ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ సెల్ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని జాబ్ డ్రైవ్‌లు నిర్వహించి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. దీపిక, అధ్యాపక బృంద సభ్యులు కృష్ణయ్య, హజీరా, ధర్మ, రవీందర్, అశోక్, చంద్రశేఖర్ మరియు నిర్మాణ్ సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.