ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.మనోహర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని రిజిస్టర్లను పరిశీలించి, ఓపి–ఐపి నమోదులను సమగ్రంగా తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై సమీక్ష నిర్వహించారు.
ఆసుపత్రికి వచ్చిన రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రోగులకు మరింత మెరుగైన, సమయోచిత వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి పరిశుభ్రతను కాపాడాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రత్యేకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నార్మల్ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్‌కు ఆదేశించారు. గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి, సరైన ఫాలోఅప్ నిర్వహించి, సమయానికి ఆసుపత్రికి రప్పించి సురక్షిత నార్మల్ ప్రసవాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హై-రిస్క్ కేసులను వెంటనే ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేయాలని తెలిపారు.
రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమృద్ధిగా నిల్వ ఉంచుకోవాలని, ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని తెలిపారు. తాగునీరు, చల్లని నీడ ప్రాంతాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వలిగొండ వైద్యాధికారి డాక్టర్ ఖాజా, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.