మెయిల్ లో హెచ్చరించిన దుండగులు
తనిఖీల్లో లభ్యం కాని బాంబు
రెండు నెలల వ్యవధిలో 23 బెదిరింపులు
ముద్ర, హైదరాబాద్ :
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టి… ఫేక్ మెయిల్ గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే… ఆదివారం ఉదయం సింగపూర్ – హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు ఓ మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులను దింపేశారు. విమానంలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడ బాంబ్ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి నేటి వరకు అంటే రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 23 నకిలీ బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన పలువురిని ఇప్పటికే గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరికొంత మంది విదేశాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో బహిర్గతం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.