Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

  • సాగులో ఉన్న భూములకే పంట పెట్టుబడి సాయం
  • భూమి లేని వ్యవసాయ కూలీలకూ ఇందిరమ్మ భరోసా
  • ఏడాదికి రూ. 12వేలు ఇవ్వాలని నిర్ణయం
  • అర్హులందరికీ రేషన్​ కార్డులు
  • రెండు పథకాలూ ఈ నెల 26 నుంచి అమలు
  • రాష్ట్ర కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు
  • మీడియాకు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతులకు పంట పెట్టుబడి కింద ఆర్​ధిక సాయం అందించే రైతు భరోసా పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేసినట్లు సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. ఈ పథకంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులు ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 10వేలు ఇస్తే.. కాంగ్రెస్​ స్రభుత్వం రూ. 12వేల ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వీరితో పాటు తండాల్లో, గూడాలు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న భూమి వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12వేలు అందిస్తామని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్​ కార్డులు జారీ చేస్తామని సీఎం తీపి కబురు చెప్పారు. ఈ రెండు పథకాలను ఈ నెల 26 రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు.

శనివారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్​ భేటీలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నది. మూడు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో మొత్తం మూడు పథకాల అమలుపై మంత్రివర్గం కసరత్తు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం..భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని,వ్యవసాయాన్ని పండుగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందిస్తామని భరోసా ఇచ్చారు. గత కొంతకాలంగా రైతు భరోసాపై ప్రతిపక్షాలు, పలు మీడియాల్లో వస్తున్న అసత్య ప్రచారానికి నేడు తెరదించామన్న సీఎం.. ఈ పథకంలో రైతులకు భరోసా కల్పించడమే తప్ప.. కోతలు లేవన్నారు.

అలాగే వ్యవసాయ యోగ్యం కాని భూములు, మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వం విధానమన్నారు. దీంతో పాటు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం రూ. 1784 కోట్లకు పెంచింది. ఈ పథకంలో భాగంగా ఎదుల–డిండికి రూ. 1800 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినెట్​ ఆమోదం తెలిపింది.

సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయించింది. అలాగే జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యేమ్నాయాలను పరిశీలించేందుకు టెక్నీకల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3 కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భర్తీకి నోచుకోని 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడేషన్​,. టూరిజం, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.

Leave A Reply

Your email address will not be published.