- పోలవరంతో భద్రాచలానికి ప్రమాదంపై ఆరా
- పూర్తిస్థాయి- అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశం
- నెల రోజుల్లో నివేదిక
- గతంలో భద్రాద్రికి ప్రమాదమని ఒప్పుకున్న ఏపీ
- పోలవరం మొదలైనప్పటి నుంచి భద్రాద్రి వరకు పెరిగిన నష్టం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం కీలకంగా భావించి, నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుతో భద్రాద్రికి ప్రమాదం ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. నిరుడు వచ్చిన వరదలతో భద్రాచలం దాదాపుగా మునిగింది. వరదలతో పెద్ద ప్రమాదం వాటిల్లింది. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయించాలని సీఎం ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని స్పష్టం చేశారు. శనివారం ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ టీంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
భద్రాచలం ముంపునకు అదే కారణం
నిరుడితో పాటు 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. ఈ మేరకు పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం
బనకచర్లపై ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు. నిజానికి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆగస్టు 2024లో పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు. దీంతో ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా ఆర్థిక సాయం చేస్తున్నది. అయితే, పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
ముప్పు మనకే..!
ఏపీ ప్రభుత్వం పలుమార్లు రీ డిజైన్లు చేసి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పు ఉందని ఇప్పటికే సాగునీటిరంగ నిపుణులు నివేదిక ఇచ్చారు. గతంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు సజావుగా దిగువ సముద్రంలో కలిసే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి వరద గతంలో మాదిరిగా సముద్రంలో కలవట్లేదు. అందుకే ఆ బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం పరిసర ప్రాంతాలలో వరద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి కొద్దిపాటి వర్షానికి చేరుకుంటుంది. అంతేకాదు.. ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతున్న భద్రాచలం మనుగడ పోలవరం ప్రాజెక్టుతో ప్రశ్నార్థకంగా మారిందని కూడా తేలింది. దీనికి అనుగుణంగా ఈ బహుళార్థకసాధక ప్రాజక్టుతో తెలంగాణ పరిధిలోని భద్రాచలం, బూర్గంపాడు సహా సమీప గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంటుందని ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కొంతకాలం నుంచి పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు లేదని వాదిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యుసీ) ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు పోలవరంతో భద్రాచలం, బూర్గంపాడు పరిసర గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉన్నమాట వాస్తవమేనని నిరుడు ఏప్రిల్‌లో అంగీకరించింది. పోలవరం బ్యాక్‌వాటర్‌పై సీడబ్ల్యుసీ ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఒక మ్యాప్‌ను తెలంగాణకు అందించింది. పోలవరంలో 150అడుగులు(45.72 మీటర్ల)వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు బూర్గంపాడు, భద్రాచలం పరిసరాల్లో ఉన్న ఆరు గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుందని తేలింది. గతంలోనే మణుగూరు భారజల కర్మాగారం, భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతాల్లో సర్వే చేసి ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాలని పీపీఏ, ఏపీఈలను సీడబ్ల్యుసీ ఆదేశించింది. కానీ ఏపీ మాత్రం ఇప్పటి వరకు అందులో కేవలం ఒక్క బూర్గంపాడు ముంపునకు సంబంధించిన సమాచారం మాత్రమే తెలంగాణకు అందజేసింది. సీడబ్ల్యుసీ సూచించిన విధంగా సంయుక్త సర్వేతో పాటు ఇతర అంశాలపై ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్‌వాటర్ కారణంగా రెండు తెలుగు రాష్ర్టాల్లోని గ్రామాలతో పాటు చత్తీ్‌సగఢ్, ఒడిశా రాష్ర్టాలకు చెందిన సరిహద్దుల్లోని గోదావరి నదీ పరివాహాక గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. అయితే ఈ ముంపు ప్రభావం భారీగానే ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఎత్తు పెంపు కారణం
నిజానికి, మొదట పోలవరం ప్రాజెక్టును 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేశారు. తాజా నివేదిక ప్రకారం ఇప్పుడు 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. దీంతో ముందుగా అనుకున్నదానికంటే ఇప్పుడు భద్రాచలానికి ప్రమాదం మరింత పెరుగుతున్నది. గతంలో గోదావరి నీటిమట్టం భద్రాచలం దగ్గర 1986లో 75.6 అడుగుల్లో ప్రవహించింది. వాజేడు నుంచి వరరామచంద్రాపురం వరకు పరివాహక ప్రాంతం అల్లకల్లోలం అయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రభుత్వం 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా ఎటపాక నుంచి సుభాష్ నగర్ వరకు 10 కిలోమీటరల్ మేర కరకట్ట నిర్మించారు. ఆ తర్వాత నుంచి ఎటపాక పరివాహకంలో వరద ప్రమాదం తగ్గింది. రెండేండ్ల కిందట వచ్చిన వరదలతో ఈ కరకట్టను నీరు తాకింది. కానీ, పెద్ద ప్రమాదం రాలేదు. నిజానికి, గోదావరి దగ్గర 70 అడుగుల మేరకు వరద వచ్చినా ప్రమాదం అంతంతే. కానీ, పోలవరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి 60 అడుగుల నుంచే వరద ప్రభావం మొదలైంది. 2013, 2020లో 60 అడుగుల్లో నీరు వచ్చింది. అప్పుడు కూడా స్వల్పంగా ప్రమాదం వాటిల్లింది. కానీ, 2020లో 60 అడుగులు దాటే వరకే చుట్టూరా వరద ఉధృతి పెరిగింది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వీటన్నింటినీ అంచనా వేసేందుకు సీఎం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.