రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పుర అభివృద్ధిలో భాగంగా లక్షల రూపాయలతో రహదారి వెడల్పు పనులు పూర్తి చేసినప్పటికీ ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతుందని కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస గార్డెన్ నుంచి కుర్మపల్లి స్టేజి వరకు నిర్మాణం చేసిన వంద ఫిట్ల రహదారికి ఇరువైపులా జరుగుతున్న మిషన్ భగీరథ పనులతో రహదారికి మరింత నష్టం జరుగుతుందన్న వాదనలు ప్రజల్లో నుంచి బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక ఏం.ఎన్.ఆర్ గార్డెన్ ఎదురుగా కుర్మపల్లి నుంచి గద్దె రాగడి,మంచిర్యాల వైపు వెళ్ళే రహదారి అనుకోని ఉన్న పెద్ద గుంత ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. మంగళవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి అందులో పడిపోయింది. వాహన చోదకునికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన క్యాతన్ పల్లి యువకులు వాహనాన్ని గుంతలో నుంచి బయటకు తీశారు. ప్రమాదకరంగా మారిన గుంత చుట్టూ చెట్ల కొమ్మలతో పాటు బండ రాళ్ళను చోదకులకు కనిపించే విధంగా ఉంచారు. సంబంధిత అర్ అండ్ బీ,మున్సిపల్ అధికారులు స్పందించి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తవ్వకాలు జరిపి వోదిలేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.