- పొలిటికల్ ఫైట్ లేదంటే లీగల్ ఫైట్.
- ఆరునూరైనా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుందాం.
- ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్ తీసుకుని వివరిద్దాం.
- బనకచర్లతో తెలంగాణను గుదిబండగా మార్చేందుకు ఏపీ కుట్ర.
- బీఆర్ఎస్ హయాంలోనే రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చ జరిగింది.
- కేసీఆర్. జగన్ ప్రగతిభవన్ లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.
- అఖిలపక్ష ఎంపీలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.ఆరునూరైనా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామన్నారు.ముందుగా రాజకీయంగా పోరాడుతామన్నారు. లేదంటే న్యాయపర యుద్ధం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం చేస్తోన్న ఈ ఉద్యమంలో అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.తెలంగాణకు గోదావరి, కృష్ణానదులే జీవనాధారం అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీ..గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి.. తెలంగాణను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని సీఎం ఆరోపించారు. ఇందుకు సమబంధించి అధికారిక డాక్యుమెంట్లను అఖిలపక్ష నేతలకు అందిస్తామన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి సమయం తీసుకుని కలిసి వివరిద్దామని కోరారు. గోదావరి నదిపై ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమం తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు.గోదావరి-బనకచర్లపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై విపక్షాలతోనూ చర్చించామని, ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారన్నారు.సాగునీటి అంశంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బనకచర్లను అడ్డుకొని తీరాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష నేతలను కోరారు.ఈ సమావేశం రాజకీయ లబ్ది కోసం ఏర్పాటు చేయలేదని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఏపీ సర్కార్ జలహారతి కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకుని టెండర్లు వేయడం, వేగవంతంగా నిధులను సమికరించుకుని యుద్ద ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
- అంతర్రాష్ట్ర నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం.
ఏపీ అంతర్ రాష్ట్ర నిబంధనలు ఉల్లంఘించి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుందన్నారు. రూ. 81,900 కోట్లతో పోలవరం రిజర్వాయర్ నుండి కృష్ణా నది మీదుగా వరద నీటిని పెన్నా కు తరలించే రీతిలో మూడు భాగాలు చేసి 417 కిలో మీటర్ల దూరానికి కాలువలు,పైప్ లు సొరంగాలతో పాటు తొమ్మిది విద్యుత్ ఆధారిత ఎత్తిపోతలపథకాల రూపకల్పన చేశారన్నారు. తద్వారా ప్రస్తుతం ఉన్న 22.59 లక్షల ఎకరాలను స్థిరకరించడంతో పాటు కొత్తగా 7.41 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టంలోని 85(8)(d)లతో పాటు 90 లను బహిరంగంగా అక్కడి ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతోందని సీఎం మండిపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఆపరేషన్ షెడ్యూల్ ను మార్చడంతో పాటు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఆదేశాలను కుడా విస్మరిస్తోందని ఆరోపించారు. పైగా గోదావరి జలాశయాల్లో 968 టి.యం.సి ల నీటివాటాను కాదని అదనపు వరద నీటిని తరలించుకునేందుకు బనకచర్లను నిర్మించ తలపెట్టిందన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణపై భాగం ముంపునకు గురవుతుందన్నారు. ప్రధానం భద్రాచలం రామాలయం తో పాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్,దుమ్ముగూడెం నుండి తెలంగాణా-ఆంద్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు ముంపుకు గురౌతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీటి సమస్యల ట్రిబ్యునల్ తుది ఉత్తర్వుల ప్రకారం తెలంగాణా, ఒడిశా,ఛత్తీస్ ఘడ్ సూచనల మేరకే షెడ్యూల్ లో మార్పులు చేయాలన్న నిబంధనలను సీఎం ఈ సందర్భంగా ఉటంకించారు. పర్యావరణ అనుమతులతో పాటు టి.ఓ.ఆర్ అనుమతులు లేవని,2018 లో కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం పోలవరం వద్ద ఆదనపు నీరు లేదని తేల్చి చెప్పినా వరద నీటితో ప్రాజెక్టును నిర్మిస్తున్నామంటూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని మోసం చేస్తుందంటూ ఆయన విరుచుకుపడ్డారు.
- కేసీఆర్, హరీష్ రావుని ఉరి తీయాలి.
గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగితే కేసీఆర్, హరీష్ రావులను ఉరి తీయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, జగన్ ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. బేసిన్‌లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ మాటలను సీఎం గుర్తు చేశారు. దావరి జలాలు పెన్నాకు తీసుకెళ్తా అని చెప్పి.. ఏపీని ప్రోత్సహిస్తాం అని చెప్పింది కేసీఆర్ అని తెలిపారు. ఇప్పుడు ఏపీ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తుంటే బీఆర్ఎస్ నేతలు తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం 300 టీఎంసీల ప్రణాళికా సిద్ధం చేసుకుంటున్నారన్న రేవంత్ రెడ్డి ఆ నీటిని తీసుకుపోయేలా కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. 2016 లో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లిలో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిందని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరిలో కలుస్తోందని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడింది ఆనాటి సీఎం కేసీఆరేనన్నారు. 2019 అక్టోబర్ లో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించడంపై చర్చించుకున్నారని వివరించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆలోచనకు ఆనాడే అంకురార్పణ జరిగిందన్నారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ లో ఎవరేం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలోనే ఉందన్నారు. ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టవద్దని తీర్మానం చేద్దామని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై టెక్నికల్, లీగల్, పొలిటికల్ గా అడ్డుకుంటామని సీఎం చెప్పారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి మా వాదన వివరిస్తామన్నారు. పొలిటికల్ గా మా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. గత ప్రభుత్వ నాయకులు కాసులకు కక్కుర్తిపడి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కమీషన్ల కోసం గ్రావిటీ ద్వారా అందించాల్సిన నీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలో 96 కేబినెట్ సమావేశాలు జరిగితే ఒక్కదానిలో కూడా కాళేశ్వరానికి అనుమతి ఇచ్చినట్టు లేదన్నారు. కావాలంటే కేబినేట్ మినిట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కు అందించాల్సిన కేబినెట్ మినిట్స్ ను ఈనెల 30 లోపు అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కూలితే ఏమైందని చెబుతోన్న హరీష్ రావుకు గుండె ఉడ పీకితే ఉంటాడో పోతాడో అని తెలుస్తుందన్నారు. కాగా సీఎం వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. అఖిలపక్షం సమావేశం అని పిలిచి రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
- మీరు చెప్తే మోడీ వినొచ్చు.. మేం మా ప్రయోజనాలు వదులుకోలేం.
ప్రోజెక్టులు పూర్తి చేయడానికి తెలంగాణలో నిధులు లేవన్న సీఎం ఏ రిజర్వాయర్ లోనూ నీళ్లు ఆగుత లేవన్నారు. ఇలా కిందికి పోతోన్న నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎత్తుకు పోతున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా చంద్రబాబుకి.. రేవంత్‌రెడ్డి కీలక సూచన చేశారు. మోడీ మీరు చెప్తే వినొచ్చు.. కానీ మా ప్రయోజనాలు వదులుకోలేమని తేల్చి చెప్పారు. తమ హక్కులు హరించాలని చూస్తే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. మిగులు జలాలు 3 వేల టీఎంసీలు నీళ్లు ఉంటే అందులో మా వాటా 968 టీఎంసీలు అన్నారు. ఆ వాటను సాధించి తీరుతామన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహంతో మీకు (ఏపీకి) నీళ్లు వస్తున్నాయన్నారు. ప్రాజెక్టులు మంచిగా నిర్మిస్తే నీళ్లు నిల్వ చేసుకోగా.. వరద ఎంత వస్తుందో తెలిసేదన్నారు. మీరు గ్యాప్ పెంచుకుంటే మంచిది కాదని చంద్రబాబును సూచించారు. మాకు కేటాయించిన నీటి వినియోగానికి ఎన్‌ఓసీ ఇవ్వాలన్నారు వ్యక్తులుగా కాదు.. రెండు రాష్ట్రాలుగా ఆలోచించాలని సూచించారు. కేటీఆర్ ఒత్తిడి తో.. కిషన్ రెడ్డి తప్పించుకున్నారన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. అత్యంత వివాదస్పదంగా మారిన బనకచర్ల సమస్య పరిష్కారం కోసం నేడు కేంద్ర మంత్రిని కలుస్తామన్నారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తమతో కలిసి రావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్డిరాజు రవిచంద్ర(బి ఆర్ ఎస్)రేణుకా చౌదరి,అనిల్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, మల్లు రవి,వంశీ కృష్ణ, సురేష్ షట్కార్, రామసహయం రఘురాంరెడ్డి, డి.కే. అరుణ,రఘునందన్ రావు, అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.
