Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

 

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 27:

వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్లు, టూ బిహెచ్కే గృహాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, గ్రామీణ త్రాగునీటి సరఫరాపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి మండల వారీగా సమీక్షించారు.

జిల్లాలో వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి గ్రామంలో ముందస్తు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఏ మండలంలోనూ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకూడదన్నారు.
బోర్వెల్స్ ఫ్లషింగ్, మోటార్ల రిపేర్, పైపుల లీకేజీ రిపేర్లు తదితర పనులకు గ్రామపంచాయతీ నిధులు వినియోగించాలని సూచించారు. తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని,ఏవేని సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
నీటి సమస్యలు పునరావృతమవుతున్న గ్రామాలను ఎంపీడీవోలు స్వయంగా సందర్శించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మెటీరియల్ కంపోనెంట్‌కు అనుగుణంగా గ్రామపంచాయతీల్లో లేబర్ వినియోగం పెరగాలని, షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ సక్రమంగా అమలు చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. చేపట్టిన పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. మంజూరైన అంగన్వాడి భవనాలను పాఠశాల ప్రాంగణంలో ఉండేలా మార్కింగ్ చేసి గ్రౌండింగ్ చేయాలని తెలిపారు.
స్కూల్ టాయిలెట్లు, అంగన్వాడి, గ్రామ
పంచాయతీ భవనాలు, పాఠశాల కాంపౌండ్ వాల్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరులు అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అవసరమైతే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, చెల్లింపుల సమస్యలు ఉంటే వివరాలు సమర్పించాలని సూచించారు. టూ బిహెచ్కే గృహాల కోసం ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్-2 బెనిఫిషియరీల జాబితాను సేకరించి సమర్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, హౌసింగ్ పీడీ చలపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులు, హౌసింగ్ ఏఈలు, ఎంపీఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.